Devudu Emi Chesinaa Mana Manchike - Moral Story In Telugu
దేవుడు ఏం చేసినా మన మంచికే!!
దేవుడు ఏం చేసినా మన మంచికే!!
దేవుడు ఏం చేసినా మన మంచికే :
అనగనగా ఒక రాజ్యానికి రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక తెలివైన మరియు దైవభక్తి గల మంత్రి ఉండేవాడు. అతనికి దేవుడు పైన చాలా నమ్మకం ఉండేది.
ఒక మనిషికి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, లేదా ఎవరికైనా లాభం వచ్చినా, నష్టం వచ్చినా అది దేవుని దయవల్ల అని నమ్మేవాడు. కొన్ని సందర్భాల్లో మనకి దేవుడు కీడు చేసినా అది కూడా మన మేలు కోసం అని ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని బలంగా నమ్మే వాడు.
ఒకరోజు రాజుగారు కత్తియుద్ధం సాధన కోసం సిద్ధమై, ముందుగా కత్తి పదును చూద్దామని తన చేతితో పదును చూడసాగారు. ఈ క్రమంలో కత్తికి పదును ఎక్కువ గా ఉండడం వలన రాజు గారి చేతి వ్రేలు కొంచెం త్రెగి రక్తం కారడం మొదలైంది.
ఇంతలో అక్కడికి వచ్చినటువంటి మంత్రి అది చూసి, మరేం పర్వాలేదు మహారాజా! ఇది చిన్న గాయమే. అయినా దేవుడు ఏం చేసినా మన మంచికే, అని అలవాటుగా రాజుతో కూడా అంటాడు.
అప్పటికే వ్రేలు తెగి, రక్తం కారుతూ బాధలో ఉన్నటువంటి రాజుగారుకి ఈ మాట విన్న వెంటనే ఎంతో కోపం వచ్చింది. నేను చేతి వేళ్లను కోసుకుని బాధపడుతుంటే.. నాకు దేవుడు మేలు చేసాడంటవా..అని, వెంటనే రాజ భటులను పిలిపిస్తాడు.
మహా మంత్రి! దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే కదా. మిమ్మల్ని ఒక రెండు రోజులు కర్మాగారంలో బంధించమని ఆజ్ఞ ఇస్తున్నాను. అదికూడా మీ మంచి కోసం అనుకోండి, అని చెప్పి మహా మంత్రి ని బంధించమని మహారాజు భటులను ఆజ్ఞాపిస్తాడు.
అది విన్న మహామంత్రి ఈ విధంగా అన్నాడు. అవును మహారాజా! ఈ శిక్ష కూడా దేవుడు నా మేలు కోరి చేసుంటాడు. నేను మీరు విధించిన శిక్షను శిరసా వహిస్తున్నాను అని అంటాడు. ఆ తరువాత భటులు మహామంత్రి ని కర్మాగారంలో బంధిస్తారు.
ఆ మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారు వేటకోసం అడవికి బయలు దేరుతారు. రాజు గారికి మంత్రి తో కలిసి బయటకు వెళ్ళడం అలవాటు. ప్రతి వారం వేటకు వెళ్ళేటప్పుడు కూడా మంత్రిగారి ని తీసుకు వెళ్లేవారు. కానీ మంత్రి శిక్ష లో ఉన్న విషయం గుర్తుకు వచ్చి.. ఈరోజుకి ఒంటరిగానే వేటకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. అనుకున్నట్టుగానే ఎటువంటి రక్షణ లేకుండా ఒంటరిగా అడివికి వేటకు వెళ్తారు.
మహారాజు అడవిలో కొంత దూరం వెళ్లిన తర్వాత మనసులో ఈ విధంగా అనుకుంటారు. ఎందుకో ఈ రోజు నా మనసు బాగోలేదు. నాతో పాటు మహా మంత్రి గారు కూడా వేటకు వచ్చి ఉంటే.. నాకు ఎన్నో కొత్త విషయాల గురించి కూడా చెప్పేవారు. రాజ్యం, రాజ్యపరిపాలన విషయాల గురించి కూడా చర్చించే వాళ్ళం. ఈరోజు మహా మంత్రి గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అని అనుకున్నారు.
వెంటనే తిరిగి రాజ్యాని కి వెళ్లి మహా మంత్రి గారి చేసిన తప్పుని క్షమించి కర్మాగారం నుంచి విడుదల చేయాలి అని నిర్ణయించుకుని తిరుగు ప్రయాణం అవుతారు.
ఇంతలో హఠాత్తుగా రాజు గారికి బందిపోటు దొంగలు ఎదురు పడతారు. మహారాజుగారు ఒంటరిగా ఉండడంతో ఇదే మంచి అవకాశం అనుకొని వెంటనే రాజు గారిని బంధిస్తారు. బందిపోటు దొంగలు ఎక్కువమంది ఉండటంవల్ల, ఒంటరిగా ఉన్న రాజుగారు ఏమి చేయలేకపోయారు.
బందిపోటు దొంగలు రాజు గారిని అడవి మధ్యలో ఉన్నటువంటి తమ స్థావరానికి తీసుకుని వెళ్తారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే తమ ఆరాధ్య దైవం అయిన కాళికా దేవికి మహారాజుని బలి ఇవ్వాలని నిర్ణయించు కుంటారు.
అనుకున్నట్టుగానే ఆ తర్వాత రోజు ఉదయాన్నే రాజు గారిని బలి ఇవ్వడానికి అంతా సిద్ధం చేస్తారు. బలి ఇచ్చే ముందు చేయవలసిన పూజలు అన్ని చేస్తారు. అనంతరం రాజు గారిని బలి ఇచ్చే స్థానంలో ఉంచి పక్కనే ఉన్న కత్తిని అందుకుంటాడు బందిపోటు దొంగ.
ఇంతలో ఒక బందిపోటు దొంగ రాజుగారి చేతికి అయిన గాయాన్ని చూసి, ఆపండి అని గట్టిగా అరుస్తాడు. ఏమైంది! అని అందరూ అడగగా.. అతని చేతికి గాయం వుంది. గాయపడిన దేహం మహంకాళి బలికి పనికి రాదు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇతన్ని మనం బలి ఇస్తే అది మనం మన దైవాన్ని అవమానించినట్టు అని అంటాడు.
ఆ తర్వాత రాజుగారి చేతికి ఉన్న గాయాన్ని అందరు గమనించి రాజు గారు బలికి పనికి రారు అని నిర్ణయించుకుంటారు. మరి ఇంక చేసేదేమీ లేక రాజుగారు ని గుండగా బాధి విడిచి పెట్టేస్తారు.
ఆ తర్వాత రాజుగారు ఎలాగోలాగ రాజ్యానికి తిరిగి చేరుకుంటారు. మహా మంత్రిని కర్మాగారం నుంచి విడుదల చేయించి జరిగిందంతా చెబుతారు.
అప్పుడు వెంటనే మహామంత్రి ఈ విధంగా అన్నారు. మహారాజా! నేను చెప్పింది నిజమే కదా. దేవుడు ఏం చేసినా అది మన మంచికే. మీకు చేతికి గాయం తగలడం వలన బందిపోటు దొంగలు మిమ్మల్ని బలి ఇవ్వకుండా విడిచి పెట్టారు...
అలాగే నన్ను మీరు కర్మాగారంలో పెట్టడం వలన కూడా నాకు మేలు జరిగింది అని అంటారు మహా మంత్రి.
అందుకు రాజు గారు ఆశ్చర్యపోతు.. అది ఎలా మహా మంత్రి అని అడుగుతారు. అప్పుడు మహా మంత్రి ఈ విధంగా అంటారు..
మహా రాజ! మీరు నన్ను కర్మాగారంలో భందించకుండ వుంటే నేను కూడా మీతో పాటే వేటకు వచ్చేవాడిని కదా. అప్పుడు బందిపోటు దొంగలకు మీతో పాటే నేను కూడా చిక్కేవాడిని. నాకు ఎటువంటి గాయాలు లేవు కాబట్టి, బందిపోటు దొంగలు నన్ను బలిచ్చి మిమ్మల్ని విడిచి పెట్టేవారు. అని అంటారు.
అది విన్న మహారాజు గారు.. అవును నిజమే కదా అని నవ్వుతారు.
నిజమే మంత్రివర్యా! మీరు చెప్పేది నిజమే.. దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే. ఈరోజు నుంచి నేను కూడా మీరు చెప్పేది నమ్ముతున్నాను.
మీలాంటి దేశభక్తి మరియు దైవ భక్తి గల మహామంత్రి మా రాజ్యంలో ఉండటం మా అదృష్టం అని చెప్పి అమూల్యమైన బహుమతులు తో మంత్రి గారిని మహారాజు గారు సత్కరిస్తారు.
నీతి : దేవుడు ఏం చేసినా అది మన మేలు కోసమే అనుకుని జీవించాలి.
- తాతయ్య కథలు.
0 Comments