Anjamma - Kapilayya - Upaayam Story in Telugu
అంజమ్మ - కపిలయ్య - ఉపాయం
అంజమ్మ - కపిలయ్య - ఉపాయం
అంజమ్మ - కపిలయ్య - ఉపాయం !!
అనగనగా ఒక అడవి ఆ అడవిలో అంజమ్మ కపిలయ్య అని రెండు కోతులు కాపురం వుండేవి, ఆ దంపతులకి ఇద్దరు పిల్లలు. ఒక రోజు సాయంత్రం తన బంధువును కలవడానికి తన ఇద్దరు పిల్లలతో కలిసి పొరుగూరు ప్రయాణం పెట్టుకుంటారు.
దారి మధ్యలోనే వాతావరణం చీకటి పడుతుంది. దట్టమైన మేఘాలు అలముకున్నాయి. ఇంతలోనే గాలి వర్షం మొదలయ్యాయి. అంజమ్మ కపిలయ్య దంపతులు చేసేదేమీలేక దగ్గర్లో ఉన్న ఒక గుహలో తలదాచుకుని వర్షం తగ్గితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంటారు.
అంజమ్మ కపిలయ్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి గుహ లోపలకి వెళుతుండగా దారిలో జంతువుల కళేబరాలు, ఎముకలు పడి ఉన్నాయి. వాటిని చూసి వెంటనే అంజమ్మ కపిలయ్యతో ఈ విధంగా అంటుంది.
ఈ గుహలో పడి ఉన్న ఎముకలను చూస్తుంటే ఇది సింగమయ్య (సింహం) నివసించే గుహ లా వుంది. ఇప్పుడు సింగమయ్య వచ్చే సమయం కూడా అయింది. సింగమయ్య కానీ మనల్ని చూస్తే ఇక అంతే సంగతులు.
దానికి సమాధానంగా కపిలయ్య ఈ విధంగా అంటాడు. మరి ఏం పర్వాలేదు, వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండి వర్షం తగ్గిన వెంటనే ఇక్కడినుంచి వెళ్ళిపోదాం. ప్రస్తుతాని సింగమయ్య లేడు కదా! . వచ్చినప్పుడు ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం అని అంటాడు. దానికి సరే అని అందరూ లోపలికి వెళ్తారు.
ఆ రాత్రంతా జోరుగా వర్షం పడుతుంది. పొద్దు పొద్దున్నే తెల్లవారుజామున వర్షం ఆగుతుంది. తెల్లవారుజామున అంజమ్మ దంపతులు గుహ నుండి బయలుదేరుతారు. ఇంతలో ఎదురుగా సింగమయ్య గృహ లోకి రావటం చూసిన అంజమ్మ, సింగయ్య వచ్చేస్తున్నాడు, ఇప్పుడు మనం ఎదురుపడితే మనల్ని ప్రాణాలతో వదలడు. ఇప్పుడు ఏం చేద్దాం అని, కపిలయ్య తో అంటుంది. కపిలయ్య వెంటనే ఒక ఉపాయం ఆలోచించి అంజమ్మ చెవిలో గుస గుస ఊదాడు.
అది విన్న అంజమ్మ వెంటనే పిల్లలిద్దరి వీపులు మీద దబదబా బాదింది. వెంటనే పిల్లలిద్దరూ ఏమీ అర్థం కాక బోరున ఏడుపు లంకించుకున్నారు.
అపుడు అంజమ్మ, గుహ లోపలికి వస్తున్న సింగమయ్యకు వినపడేలా కపిలయ్య తో ఇలా అంది. ఏవండి పిల్లలిద్దరూ ఆకలికి తట్టుకోలేక ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎలా ఏదైనా తినడానికి తీసుకురండి అంటుంది.
అప్పుడు కపిలయ్య గంభీరమైన గొంతుతో ఇలా అన్నాడు.
కాసేపు ఆగు, ఈ గుహలో నివసించే సింహం త్వరలో ఇక్కడికి వస్తుంది. దానిని చంపి మనం తిందాం అని అంటాడు.
ఆ మాటలు విన్న సింగమయ్యకు ఒక్కసారి గుండెల్లో గుబులు పుట్టింది. తనకంటే క్రూర జంతువులు ఇంకేవో లోపల ఉన్నాయని భయపడి గుహ లోపలికి రాకుండా ప్రాణభయంతో అక్కడినుంచి బయటికి వెళ్ళిపోసాగాడు.
అలా తిరుగు ప్రయాణమైన సింగమయ్య మార్గమధ్యమున చిరుతయ్య (చిరుత పులి) ఎదురు పడతాడు. సింగమయ్య జరిగిందంతా చిరుతయ్య కి వివరిస్తాడు. అది విన్న చిరుతయ్య పెద్దగా నవ్వి..ఈ అడవిలో నీకన్నా క్రూరమైన జంతువులు ఇంకా ఏమున్నాయి. అయినా..... నీ గుహ లో ఉన్నది క్రూరమైన జంతువులు కాదు. అంజమ్మ - కపిలయ్య దంపతులు. నిన్న వర్షం పడినప్పుడు వారిద్దరూ పిల్లలతో కలిసి నీ గుహలోకి వెళ్ళడం నేను నా కళ్ళతో చూశాను. పద ఇప్పుడే నీ గుహ లోకి వెళ్లి, వాళ్ళందరిని చంపి మనసారా తిందాం అని చిరుతయ్య అంటాడు.
ఆ మాటలు సింగమయ్య నమ్మక పోవటంతో చిరుతయ్య మన ఇద్దరి తోకలు పీటముడి వేసుకుందాం నేను కూడా నీతో వస్తాను వెళ్దాం పదా.! అని అంటాడు. దానికి సింగమయ్య సరే అని ఇద్దరూ తోకలు పీటముడి వేసుకుంటారు. ఇద్దరూ కలిసి సింగమయ్య గుహ కి తిరుగు ప్రయాణమవుతారు.
ఇదంతా గమనించిన కపిలయ్య, అంజమ్మ చెవిలో మళ్ళీ ఏదో గుస గుస చెప్పాడు. అది విన్న అంజమ్మ మళ్లీ పిల్లల వీపుల మీద దబ దబా బాదింది. పిల్లలిద్దరికీ ఇదంతా ఏమీ అర్థం కాక అయోమయంతో పిల్లలు ఇద్దరూ కేకలు పెడుతూ బిగ్గరగా ఎడవడం మొదలు పెట్టారు.
ఇంతలో గుహ బయటకి తోకలు పీట ముడి వేసుకున్న సింగమయ్య, చిరుతయ్య వస్తారు. అది గమనించిన కపిలయ్య ఇలా అంటాడు.
పిల్లలిద్దరూ ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నారు. కొంచెం సేపు ఆకలి ఓర్చుకో లేరా...? సింహం వచ్చే వేళ అయింది. సింహానికి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకురమ్మని చిరుతయ్య ను పంపాను. చిరుతయ్య సింగమయ్యను తీసుకుని వచ్చే వేళ అయింది. కొంచెం సేపు వేచి ఉండండి. ఒక వారానికి సరిపడా ఆహారం తిందురుగాని అని గంభీరంగా బయట ఉన్నా సింగమయ్యకు వినపడేలా అంటాడు!!!
ఆ మాటలు విన్న సింగమయ్యకు ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంది. ఆ గంభీరమైన మాట విన్నదే తడువు నన్నే మోసం చేస్తావా అని చిరుతయ్య వైపు కోపంగా చూసి అక్కడి నుంచి పారిపోసాగాడు. చిరుతయ్య సింగమయ్యను ఆగమని ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది.
సింగమయ్య పారిపోవాలని తొందరలో తోకలు పీటముడి వేసుకున్న సంగతి మర్చిపోయాడు. సింగయ్య భయంతో పరుగు లంకించుకుంటాడు. ఇద్దరు చెరోవైపు లాగడంతో తోకలు తెగి తుప్పల్లో, పొదల్లో చెరోవైపు పడిపోతారు.
సింగమయ్య కి పళ్ళు మొత్తం వూడిపోతాయి. చిరుతయ్య కి ఎడాపెడా దెబ్బలు తగులుతాయి. డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది.
దీన్నిబట్టి మనకు అర్థమైన నీతి ఏంటంటే - ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్ని అయినా తప్పించుకోవచ్చు. అలాగే భయంతో ఉన్న వారికి ఎంత బలం ఉన్న ప్రయోజనం ఉండదు.
ఈ కథ మన చిన్నప్పుడు మూడవ తరగతి తెలుగు లో ఉంటుంది.
- తాతయ్య కథలు.
- Taatayya Kathalu
0 Comments