Firewood Merchant And The Dryad Story In Telugu
కట్టెల వ్యాపారి - వనదేవత
ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక కట్టెల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతి రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.
ప్రతి రోజులాగే ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా, అకస్మాత్తుగా అక్కడ వనదేవత ప్రత్యక్షమయి నీవు ఎందుకు కట్టెలు కొట్టి అడవిని నాశనం చేస్తున్నావు. నువ్వు ఈ విధంగా రోజు కట్టెలు కొట్టి అడవి ని నాశనం చేయడం వల్ల ఇక్కడ జీవించే జంతువులు, పక్షులు మరెన్నో ప్రాణాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి చర్యలు నేను అంగీకరించను అని చెప్పి కట్టెల ను కొట్టకుండా అడ్డుపడుతుంది.
అప్పుడు ఆ వ్యాపారి నేను కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇది నా జీవనాధారం, నేను ఈ పని చేయకపోతే మరి ఎలా జీవనం సాగించాలి అని అడుగుతాడు వనదేవత ను.
అప్పుడు వనదేవత అతను చెప్పింది న్యాయం అనిపించి అతనికి ఇంకా ఏదైనా జీవన ఉపాధి మార్గం చూపించాలి అనుకొని అతనికి ఒక ఆవును ఇచ్చి, దీనినీ తీసుకుని వెళ్ళు ఇది రోజుకి కడివెడు పాలు ఇస్తుంది. వాటిని అమ్ముకుని జీవించు అని చెప్తుంది.
కట్టెల వ్యాపారి వనదేవత చెప్పిందానికి ఎంతో సంతోషించి అలాగే అని చెప్పి ఆవుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు.
ప్రతిరోజు ఆవుకి గడ్డి పెట్టి, పాలు తీసి వాటిని పట్టణానికి తీసుకువెళ్లి అమ్ముకుని కొంతకాలం హాయిగా జీవితాన్ని గడుపుతాడు.
ప్రతిరోజు ఇదే విధంగా చేసి జీవితం గడపడానికి ఇష్టపడ ని కట్టెల వ్యాపారి యధావిధిగా ఎప్పటిలాగే గొడ్డలి పట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు.
అడవిలో ఒక వృక్షాన్ని నరకబోతున్న కట్టెల వ్యాపారిని చూసి వెంటనే వనదేవత మరల ప్రత్యక్షమయి, నీకు జీవనానికి మార్గం చూపించాను కదా అయిన నువ్వు మరల
ఎందుకు కట్టెలు కొడుతున్నావ్ అని అడిగింది.
అప్పుడు ఆ వ్యాపారి నాకు ఆ పాలు అమ్మితే వచ్చే డబ్బులు సరిపోవటం లేదు. అందుకే కట్టెలు కొట్టుకుంటున్నాను అని చెప్పాడు.
అప్పుడు వనదేవత ఆ వ్యాపారికి ఇలా చెప్పింది. సరే అయితే నీకు ఒక బంగారు బాతు ఇస్తాను. ఈ బాతు రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. దాన్ని అమ్ముకుని నీ జీవితాన్ని సుఖంగా జీవించు. మరింకెప్పుడు అడవులను నరకవద్దు అని చెప్తుంది.
ఆ కట్టెల వ్యాపారి సరే అని చెప్పి ఎంతో ఆనందంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు.
ఒక వారం రోజులు అలా గడిచిన తర్వాత ఆ వ్యాపారికి దురాశ పెరిగి, ఈసారి అడవికి వెళ్లి చెట్లు నరికితే వనదేవత ప్రత్యక్షమయి ఇంకా ఏదైనా ఇంతకంటే విలువైన బహుమతి ఇస్తుంది అని అనుకుంటాడు. అదే గనుక జరిగితే ఈ గ్రామంలో నాకంటే ధనవంతుడు ఎవరు ఉండరు అని ఊహించుకుంటాడు.
అనుకున్నదే తడవుగా మళ్ళీ గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్ళి కట్టెల కోసం చెట్లను నరకడం మొదలు పెడతాడు.
అప్పుడు వనదేవత మళ్లీ ప్రత్యక్షమయి మళ్లీ ఎందుకు వచ్చావు అని వ్యాపారిని అడిగింది.
అందుకు సమాధానంగా వ్యాపారి ఈ విధంగా అన్నాడు.. నాకు ఈ బంగారు గుడ్లు అమ్మితే వచ్చిన డబ్బులుకూడా సరిపోవట్లేదు. ఇంకా ఏదైనా గొప్పదనం ఇచ్చే వస్తువు కావాలి అని అడిగాడు.
అప్పుడు కట్టెల వ్యాపారి యొక్క దురాశను గమనించిన వనదేవత కు కోపం వచ్చి ఆ ఆవుని, బాతునీ తీసుకొని ఆక్కడ నుంచి అదృశ్యమయ్యింది.
అప్పుడు ఆ వ్యాపారి కోపంతో గొడ్డలి పట్టుకుని చెట్టుని నరకగా, చెట్టు విరిగి గొడ్డలి తన కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగిపోయింది. వ్యాపారి బాధ తో కృంగిపోయాడు.
కట్టెల వ్యాపారి కొంత కాలం మంచాన పడ్డాడు. గాయం మానిన తర్వాత తన పెరట్లో పండ్లు పూల మొక్కలను పెంచుకుంటూ, పచ్చని కూరగాయలు పండించుకుంటూ వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించ సాగాడు.
అది చూసి ప్రత్యక్షమైన వనదేవత వ్యాపారి లో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందించింది.
అందుకే అతిగా ఆశ పడకూడదు. దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు ఊరికే అనరు.
-Tatayya Kathalu


0 Comments