Chettu Sakshyam Story In Telugu

Chettu Sakshyam Story In Telugu

చెట్టు - సాక్ష్యం కథ


చెట్టు సాక్ష్యం :



         అవంతీపురం అనే  ఒక ఊరులో ధనగుప్తుడు, నందిగుప్తుడు అను ఇద్దరు మిత్రులు వుండే వారు.  వాళ్ళిద్దరూ కలసి ఒక వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారం పెట్టడానికి పొరుగున ఉన్న పట్టణానికి వెళ్తారు. అనుకున్నట్టుగానే మంచి వ్యాపారం పెట్టి మంచి లాభాల బాటలో పయనిస్తారు. వాళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది. వ్యాపారంలో బాగా ఆరితేరారు. వాళ్లు బాగా డబ్బు సంపాదించి ఊరికి తిరిగి వచ్చారు.

వ్యాపారం వారికి వెన్నతో పెట్టిన విద్య కావున సొంత గ్రామంలో వ్యాపారం పెట్టాలి అనుకుంటారు. అంతవరకు సొమ్ము ఎక్కడైనా దాచాలి. ధనానికి దాపరికం సేద్యానికి వెల్లడి అన్నారు కదా!.




సొమ్ము ఎక్కడ దాచాలి అని ఆలోచించారు. ఊరి బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద దాచాలి అనుకున్నారు. ఇద్దరూ కలిసి చెట్టు చెట్టు దగ్గరకు వెళ్లారు. చెట్టు కింద గొయ్యి తవ్వి అందులో డబ్బులు దాచి పెట్టారు. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు.

డబ్బుకు లోకం దాసోహం అని ధనగుప్తుడి నమ్మకం. అతనికి దురాశ పుట్టింది. మొత్తం సొమ్ము తానే కాజేయలనుకున్నాడు. ఒకనాటి రాత్రి చెట్టు దగ్గరికి వెళ్లి దాచిపెట్టిన మొత్తం ధనం తెచ్చుకున్నాడు. ఇంట్లో దాచి ఉలుకూ పలుకూ లేకుండా ఊరుకున్నాడు.


కొన్నాళ్ళ తరువాత నందిగుప్తుడు, ధనగుప్తుని వద్దకు వచ్చి ఈ విధంగా అన్నాడు. మిత్రమా మనము దాచిపెట్టిన సొమ్ముని తిరిగి తెచ్చుకుని వ్యాపారం మొదలు పెడదాం. దానికి ధనగుప్తుడు సరేనని ఇద్దరూ కలిసి డబ్బు దాచి పెట్టినటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళారు. 

ధనగుప్తుడు తేలు కుట్టిన దొంగలా చూస్తు నిల్చున్నాడు. నందిగుప్తుడు మాత్రమే గొయ్యి తవ్వాడు. ఎంత తవ్వినా ధనం కనిపించకపోయేసరికి ధనగుప్తుని వైపు చూశాడు. అప్పుడు ధనగుప్తుడు ఇలా అన్నాడు. మిత్రద్రోహి డబ్బు మొత్తాన్ని నువ్వే దొంగిలించి నాకేసి అమాయకంగా చూస్తావా?  అని ధైర్యంగా అంటాడు. దొంగకి ధైర్యం ఎక్కువ అంటారు కదా ..ఇందుకే!

అప్పుడు నందిగుప్తుడు, మిత్రమా నాకు ఏమీ తెలియదు అంటాడు. ధనగుప్తుడు మూర్ఖుడా! పద రాజుగారి వద్దకి ఆయనే న్యాయం చెప్తారు అంటాడు.





సరే అని ఇద్దరూ రాజు గారి వద్దకు వెళతారు. జరిగిందంతా రాజుగారికి పూసగుచ్చినట్లు వివరిస్తారు. అంతా విన్న రాజు గారు సరే అయితే మీరు చెప్పిన దానికి సాక్ష్యంగా చెట్టు ఉంది. రేపు ఉదయం చెట్టు దగ్గరకు వచ్చి నా యొక్క తీర్పు వెల్లడిస్తాను అని అంటారు. దానికి ఇద్దరు మిత్రులు సరే అని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోతారు.

ఆరోజు రాత్రి ధనగుప్తుడు తన తండ్రికి జరిగిందంతా చెప్పి, రేపు ఉదయం రాజుగారు చెట్టు వద్దకు రాకముందే నువ్వు ఆ చెట్టు తొర్రలో దూరి దాక్కోవాలి. రాజుగారు  చెట్టుకి సాక్ష్యం అడిగినప్పుడు నందిగుప్తుడే ఆ ధనాన్ని దోచుకున్నాడు అని చెప్పాలి అని కోరాడు. దానికి మొదట ధనగుప్తుని తండ్రి ఒప్పుకోలేదు. పరుల సొమ్ము ఆశించడం తప్పు అని కొడుకుని మందలిస్తాడు. ఎంత చెప్పినా ధనగుప్తుడు ఒప్పుకోక పోయేసరికి తర్వాత కొడుకు మాట కాదనలేక అయిష్టంగానే సరే అని అంటాడు. 




మరుసటి రోజు ఉదయం  మహారాజుగారు పరివారంతో చెట్టు వద్దకు వస్తారు. చెట్టుని ఈ విధంగా, ఓ వృక్ష రాజమా.. ఇక్కడ దాచి పెట్టిన సొమ్ము ఎవరు తీశారు అని ప్రశ్నిస్తారు? 

అప్పుడు చెట్టు తొర్ర లో దాగిఉన్న ధనగుప్తుడు తండ్రి "ఆ ధనాన్ని మొత్తం నందిగుప్తుడే దొంగలించాడు మహారాజా!. ధనగుప్తుడు ఏ పాపం ఎరగడు" అని చెప్తాడు. అది విన్న మహారాజు చెట్టు మాట్లాడటం ఏమిటి అని సందేహించి, భటులారా ! ఈ చెట్టు చుట్టూ గడ్డివేసి మంట పెట్టండి అని అన్నారు. వెంటనే రాజభటులు చెట్టు చుట్టూ ఎండు గడ్డివేసి మంట పెడతారు. 

మంటల నుండి వచ్చే పొగలు చెట్టు చుట్టూ దట్టంగా అలముకున్నాయి. చెట్టు తొర్రలో ఉన్న ధనగుప్తుడు తండ్రికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోతాడు. వెంటనే మహారాజా మహారాజా అంటూ అరుస్తూ బయటకు వచ్చేస్తాడు. క్షమించండి మహారాజా! డబ్బుకి ఆశపడి నా కొడుకు చెప్పిందానికి తలొగ్గి ఈ పని చేశాను. నన్ను మన్నించండి. నందిగుప్తుడు ఏపాపం ఎరుగడు. నా కొడుకు ధనగుప్తుడే ధనాన్ని మొత్తం దోచుకున్నాడు. అని క్షమాపణ వేడుకుంటాడు.


రాజుగారు వెంటనే ధనగుప్తుని బంధించమని రాజ భటులను ఆజ్ఞాపిస్తారు. సొమ్ము మొత్తం నందిగుప్తుడుకి ఇప్పిస్తారు. ధనగుప్తుని తండ్రిని క్షమించి విడిచి పెడతారు.


- తాతయ్య కథలు.

- Taatayya Kathalu

Post a Comment

0 Comments